Sunday 19 February 2012

నా పూల తోట.. నా పూల తోట..


సన్నజాజి సన్న గా జారుకుంది...
మల్లె మత్తు గా మాయమయింది ... 

రోజా రాను రానంటూ రోదించింది ...
కనకాంబరం కెవ్వు మని కేకేసింది ...

కస్తూరి కావు కావు మని కాదనింది..
తామర చూస్తూనే తేలిపోయింది ...

మందారం ముద్దగా అయిపొయింది...
కలువ కాగితం లా తనని తానె కావలించుకుంది ...

ఏమయిందే అంటే , పలకవే ....
పక్కనే ఉన్న గోరింటాకు నడిగితే ,

"నన్ను నీ చేతికి అతికించినట్టు ,వాటిని నీవు నీ తల లో అలంకరించుకుంటా"వని భయమట అని అంది .
అప్పుడు సీత (నేను) నవ్వి  ,

అయ్యోరామ !! మిమ్మల్ని నా కోసం కాదు లే..
కృష్ణుడి కి అలంకరించడానికి అని అన్నానో లేదో ...
అంతే,

అన్నీ..ముందు నన్ను, ముందు నన్ను  అని  
విచ్చుకొని చుట్టూ ముట్టాయి....!!!!

--సీత ....

Thursday 9 February 2012

గుర్తింపు అవసరమా?

ఒక చిన్న కథ చెప్పుకుందాం


ఒక ఊరిలో ఒక కుక్క ఉండేది .అది యజమాని ఇంట్లో నుండి బయలుదేరి వెళ్లి షాప్ లో యజమాని ఇచ్చిన చీటీ ఇచ్చి వస్తువులు నోటితో పట్టుకొని షాప్ వాడికి డబ్బులు కూడా ఇచ్చేసి,ఎదురుగా ఉన్న బస్సు స్టాప్ లో నిల్చొని అయిదు బస్సులు వచ్చి వెళ్ళాక తనకి కావాల్సిన బస్సు ఎక్కి నిల్చొని స్టాప్ లొచ్చి వెళ్ళాక అది దిగాల్సిన స్టాప్  దగ్గర దిగింది.ఇదంతా ఒక మనిషి గమనిస్తూ ఉనాడు.దానిని అనుసరిస్తూ వెళ్ళాడు. అది వెళ్లి తలుపు తట్టగా యజమాని వచ్చి తలుపు తీసి దానిని బెల్ట్ తో,కాలి తో కొట్ట సాగాడు .ఆ కుక్క ని అనుసరిస్తూ వచ్చిన మనిషి మాత్రం ఆ యజ మానిని ఆపి "మీరేం చేస్తున్నారు ?ఇది ఎంత తెలివయిన కుక్కో మీకు తెలీదు ."అని జరిగిందంతా చెప్పాడు.
దానికి ఆ యజమాని నాకు తెలుసు ఇది మళ్ళి ఇలానే చేస్తుందని ,ఇది పదో సారి వెళ్ళేటప్పుడు తలుపు కి తాళం వేసుకోమని చెప్పాను .కాని ఇది బంగారం లాంటి నా నిద్ర ని పాడు చేసింది అన్నాడు.
దానికి ఆ వ్యక్తి ఖంగు తిన్నాడు .

దీని వల్ల మనమేం తెలుసుకోవాలి అంటే,

నీకెంత తెలివితేటలూ ,టాలెంట్ ఎంత నువ్వు బయిటికి చూపినా నీ పై వాడు అది గుర్తించనప్పుడు అంటా వృథా ....
బూడిద లో పోసిన పన్నేరెఅ....అందుకే కనీస  గుర్తింపు  ఎవరికయినా  అవసరమే
..


సీత ....

Sunday 5 February 2012

నాలో నువ్వు ....



 
చల్ల  గాలి వీచే వేళ
చందమామ చూచే వేళ 
చుట్టూ చీకటి చేరిన వేళ 

కనుపాప కదిలింది 
అరచెయ్యి వణికింది 
పెదవి తోణికింది

మనసు నివ్వెరపోయింది 
ప్రాణం ఉలిక్కిపడింది 

మౌనమే భాషయింది 
చూపే బాణమయింది

 కృష్ణ !!
    నీ కోసం చూచిన కనులు 
    నీ స్పర్స కై తపించిన కరములు 
    నీ పలుకుకై అల్లాడిన కర్ణాలు
    నీకై జపించిన మనసు 
    నీకై తపించిన ప్రాణం 
అన్నీ నీవు రాగానే 

"నీవేనా" అన్నట్టు  నే  ఆగిపోతే........
"నేనే" అని నీ బదులు" నవ్వే"అయితే ...

నీ వేణుగానం లో తడిసి ...
నీ పలుకులలో మునిగి ...
బృందావనం లో తిరిగి ...

నీ కంటి పాపనై...
నీ చేతి రేఖనై..
నీ పెదవుల పై నవ్వై...
నీ పాదాల పై పువ్వునై ....
నీ పించం పక్కన ఒక చిన్న వక్రమైన భాను కిరణమై ఉండిపోనా ..........!!! 

(చంద్రుణ్ణి శివుడు స్వీకరించేసాడు గా...)

నోట్: ఎవ్వరు దయచేసి కాపీ చెయ్యకండి .చేసుకున్న కింద మీరు రాసినట్టు గా పెట్టకండి .its a request .
-- సీత ..

Saturday 4 February 2012

నేను నా కృష్ణుడు ...




పొద్దున్నే లేస్తానా నలుగున్నారకి ఎదురుగా నాకుఇష్ట్తమయిన కృష్ణుడి బొమ్మ లేచావా అంటూ ఒక నవ్వు , లేచాను  అని చెప్పి ,అలా కింద చిమ్మి ముగ్గు వేద్దామని కిందకి వెళతానన్న మాట..నా చేతిలో చీపురు కట్ట .కింద లైట్ వేసుకొని చిమ్మడం  మొదలెట్టాక నా కళ్ళు  పైన కనిపించిన నల్లనయ్య ఈ వెలుతురు లో కనిపించడెం ? అని అడుగుతుంటాయి నా కళ్ళు  . నిన్న గురువుగారు చెప్పిన సీతమ్మ మాయమ్మ ,శ్రీరాముడు మాకు తండ్రి అని పాట పాడుకుంటూ,శ్రీ కృష్ణుడు గురించి ఇలా చెప్పలేదు   అని నవ్వుకొని ఇంక స్టవ్ మీద నీళ్ళు కాచుకుందామని పైకి వచ్చేసి స్టవ్ ఆన్ చేస్తానా తలుపు తీస్తాన చల్ల గా వచ్చే గాలి , పైన చందమామ ఇక టాటా అన్నట్టు గా చూస్తూ ఉంటాడు . అప్పుడు మా స్టవ్ వెనకాల ఉండే కృష్ణుడి క్యాలెండరు పైన టక టక అని ఇటు చూడు చందమామ ఒక పూట  వస్తాడు పోతాడు ,నేను ఇక్కడే నీతో నే ఉంటాను గా  అన్నట్టు గా పిలుస్తుంటాడు .ఏమిటీ అంటే...ఏమీ ఉండదు ....ఒక చిన్న నవ్వు ....!!!



సరే అని ఇంకా తయారయ్యి అయిదున్నర కి బండి బయిటికి తీసి ఆ చలి లో బండి తీసుకొని లైట్ వేసుకొని మ్యూజిక్ క్లాసు కి బయలుదేరుతుంటే ......బండి మీద పాయింటర్ల మీద ఉండే కృష్ణుడు నన్ను చూసి పద పద...అని ఒక నిట్టూర్ఫు లా నవ్వుతుంటే , hmmmmm అనుకొని బండి కదిలించి అలా వెళ్తూ ఉంటె , ముందు గా రామాలయం నుండి వచ్చే సుప్రభాతం వింటూ ,అలా శివాలయం రాగానే  శివ శివ అంటూ వచ్చే స్తోత్రాలను దాటుకొని సాయిబాబా గుడి మీద గా సాయి సాయి నమో అని వింటూ అలా చల్ల గాలికి వణుకుతూ హమ్మ!! వచ్చేసాను  అనుకుంటూ  బండి కి లాక్ వేస్తుంటే నా బండి keychain పైన ఉండే కృష్ణుడు ఒక లా వేణువు పట్టుకొని నవ్వుకుంటూ ఉంటె , నీకేమి బాబు అని నేనని లోపలి వెళ్లి సంగీతం లో ప్రార్ధన మొదలు పెడతానా ...నాతొ ఉన్న ముగ్గురి సంగతేమో కాని , వినాయకుణ్ణి ,సరస్వతిని ,భూదేవి ని,త్యాగరాజు ని అందరిని తలుచుకుంటానే  కృష్ణుడి పేరు ఎందుకు లేదబ్బా అనుకుంటూనే క్లాసు మొదలయిపోతుంది .ఇంకా పాటలన్నీ పాడుతూనే చుట్టూ ఉన్న చెట్లు ని చూస్తూ ఉండగా ఒక రోజు ఒక సన్నని పిల్లగాలి మెడ ని తాకి ఇటు చూడు అన్నట్టు గా మొహం అటు తిరిగితే చెట్లన్నీ ఒకే రీతి లో ఊగాయి ....

అప్పుడే ఒక కీర్తన --ఏ రంగో నీ రంగు ఎవరికీ తెలుసు 
                       ఓ రంగ !నీ రంగు నీల వర్ణమనే తెలుసు  ...అని పాడుకుంటూ ఆకాశాన్ని చూస్తే నీలం గా ఉంది ..
ఓహో..!! ఇదే నా ! నా కృష్ణుడి రంగు అనుకుంటూ ఇంతలోనే 
రంగు రంగుల జీవులలో నీవై ఉన్నావు .. 
అని మా గురువుగారు  చెప్తుంటే ..మళ్ళి అదే తికమక ....అసలు క్రిష్ణుడిది ఏ రంగు అబ్బా అనుకుంటూ ఇంకో పుస్తకం 
తీసుకుంటుంటే పుస్తకం పై ఉన్న కృష్ణుడి బొమ్మ ..నా రంగు తెలుసుకోవడం నీ వల్ల కాదు లే పని చూడు అని ఎగతాళి గా నవ్వుతుంటే ...సరేలే పో...అనుకుంటూ అప్పుడు కానిచ్చి మళ్ళి ఇంటికి బయలుదేరుతూ దూరం గా  ఉన్న కృష్ణ మందిరానికి వెళ్దాం అనుకుంటూ గడియారం చూస్తే ఇంటికి పద పద ...కాలేజీ కి టైం అవుతోన్దంతుంటే ..సరే రేపోస్తాను లే కృష్ణయ్య అనుకుంటూ....బండి ని చూడగా దాని పైనున్న కృష్ణుడి బొమ్మ భలే వచ్చావు లే ,రెండు సంవత్సరాల నుండి అని నన్ను చూసి వెక్కిరింత గా నవ్వుతుంటే , తప్పు ఒప్పుకోక తప్పదు లే అని ఇంటికి సాగిపోయి ,టిఫిన్ చేసి రెడీ అయ్యి ,అమ్మ వెళ్ళొస్తా,బామ్మా వెళ్ళొస్తా  అంటూ మూడు మెట్లు దిగేసి  మళ్ళి అయ్యోరామ ..!!అనుకొని మళ్ళి వెనక్కి వచ్చి కృష్ణుడికి టాటా చెప్పి  కాలేజీ కి వెళ్ళిపోయి ,అక్కడ పాఠాలు బుర్రకేక్కించు కొని , 
hushhh హమ్మయ్య !!అనుకుంటూ సాయంత్రం ఇంటికోచేస్తా.

రాగానే జరిగిన సంగతులు,నా గతులు అన్ని కృష్ణుడి కి చెప్దాం అని రోజు ఆయన బొమ్మ దగ్గరికి వెళ్తానా...ఆ లోపే వచ్చావా ..మళ్లీ రా !!వినిపించు ఇంకా నీ మోత అన్నట్టు గా చెవులు చాచి కన్నులు పెద్దవి చేసి చూస్తే సరే వద్దు లే 
కృష్ణయ్య...అని దండం పెట్టుకొని వెనక్కి వెళ్ళిపోతా.

సరే ఇంకా ఇంట్లో కబుర్లు చెప్పుకొని నాకో చిన్న పెట్ ఉన్నాడు . మా పిన్ని కొడుకు నా బుల్లితమ్ముడు .వాడితో ఆడుకున్నంత సేపూ కృష్ణుడు ఇలానే ఉంటాడా!! అని అనిపింఛి కొని ఏమోలే అనుకోని .మళ్లీ వాడిని నిద్రపుచ్చి ఇంటికి వెళ్ళగానే , మా బామ్మా దేవుడి దీపం పెడితే దణ్ణం పెట్టుకొని హారతి తీసుకొని వెళ్తుంటే మళ్లీ టాకాటాకా మని కృష్ణుడు బొమ్మ చూస్తే ...ఏంటో కృష్ణ !!ఈ జీవితం మళ్లీ కాలేజీ వర్క్స్ చేసుకోవాలి అని చెప్తే సరే కాని చెయ్యి నేను సహాయం చేస్తా లే అని ఒక ధైర్యన్నిచ్చే నవ్వు చూసి కొంచం సేపు చదువుకొని ,మళ్లీ ఈ కంప్యూటర్ ఆన్ చేయగానే desktop మీద మళ్లీ చిన్న వాడయిపోయి వేణువు ఊదుతూ ,కనిపించగానే ...వచ్చావా అని ఆ నవ్వు కి వచ్చాను అని సమాధానం చెప్పి పని చేసుకొని , అన్నం తినడానికి  పిలుస్తుంటే ఇక్కడున్న కృష్ణుడికి టాటా చెప్పేసి అన్నానికి వెళ్లి కూర్చొని ఉంటె  టీవీ పైన ఉండే కృష్ణుడు నాకు పెట్టావు కదా?అని గోము గా నవ్వుతుంటే .....ఇది వెన్న కాదు కృష్ణయ్య ..అన్నం అని నేను చెప్పి ,అక్కడికి ముగించి  వెళ్ళిపోతా.మళ్లీ ఇంకా పడుకోవడానికి కింద  చాపలు వెయ్యమని అమ్మ చెప్తే వేసి పడుకుంటే  పొద్దున్న లేచావా అంటూ పలకరించిన కృష్ణుడు వచ్చి బాగా అలసిపొయావు లే ఇక పడుకో అని ఆ చెయ్యి పైకెత్తి అలా నవ్వితే మళ్లీ జయజనర్ధన కృష్ణ అంటూ పాడుంటూ పడుకుంటే రాత్రి కలలోనయినా వదులుతాడా ? ఈ కృష్ణుడు అంటే ...అబ్బే!!అస్సలు వదలడు. కలలు ఎన్ని వస్తాయో కృష్ణుడి గురించి ....

అందుకే నాకు అనిపిస్తూ ఉంటుంది... 
భగవంతునికి భక్తునికి అనుసంధానమయినది అంబిక దర్బార్బత్తి కాదు ...
ఒక చిన్న నవ్వు అని..ఆ నవ్వే మన జీవితాలని వెలిగించే కొవ్వొత్తి అని 


ఇప్పుడు నాకొక పెద్ద సందేహం .ఎవరయినా తీర్సుస్తారా ??ప్లీజ్............
నేను కృష్ణుడిని వదలట్లేడా లేక కృష్ణుడు నన్ను వదలట్లేడ్డా??
నేను కృష్ణుడిని నాతొ  ఉంచుకున్నానా  లేక తనే నాతొ ఉండిపోయాడా ??


మీరయినా  చెప్పరూ ప్లీజ్.................
--సీత ...


Wednesday 1 February 2012

భారతానికి శ్రీకారం ఇలా..


పరాశర మునీంద్రుడికి, సత్యవతికి జన్మించినవాడు వ్యాసుడు. సత్యవతి అసలుపేరు కాళి. మత్స్యగంధి అని కూడా అంటారు. బెస్త పిల్ల.
చేది దేశపు రాజు ఒక సారి వేటకని అడివికి వెళ్ళాడు. అక్కడ క్రీడిస్తున్న జంతువుల జంటను చూసి ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయాడు. కాళిందీ నదీతీరాన జరిగిందది. శాపవశాన చేపరూపాన ఆ నదిలో వున్న అద్రిక అనే దేవకన్య ఆ రేతస్సును స్వీకరించింది.
చేప గర్భం ధరించింది. కడుపులో వున్న చేప కదల్లేక మెదల్లేక బెస్తవాడి వలకు చిక్కింది. తీరా దాన్ని ఇంటికి తీసుకువెళ్ళి కోస్తే ఆ చేప కడుపులో ఇద్దరు పసికందులున్నారు. ఆ ఇద్దరిలో మగ పిల్లవాణ్ణి బెస్తరాజుగారికే ఇచ్చేశాడు. ఆడపిల్లను తానే అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఆ అమ్మాయికి "కాళి" అని పేరు పెట్టాడు.
కాళి పెరిగి పెద్దదైంది. పెళ్ళీడు పిల్లయింది.
పరాశర మహర్షి ఒక రోజు కళిందీ నది దగ్గరకు వచ్చి ఆవలి ఒడ్డుకు వెళ్ళేందుకు పడవ కోసం చూస్తున్నాడు. ఆ సమయంలో కాళి తండ్రి నది ఒడ్డున అప్పుడే చద్దిమూట విప్పుకుని భోజనానికి కూర్చోవడం వల్ల మహర్షిని ఆవలి ఒడ్డుకు తీసుకువెళ్ళమని కూతుర్ని పురమాయించాడు. మత్స్యగంధి సరేనంది. మహర్షి పడవలోకి ఎక్కాడు. పడవ నడుస్తోంది. ఎగిసిపడే అలలు, ఎగిరెగిరిపడే చేపపిల్లలు, పడవ నడిపే వయ్యారి - పరాశరుడికి చిత్తచాపల్యం కలిగించాయి.
కామోద్రేకంతో ఆమెను సమీపించాడు. మునిపుంగవుని కోరికను పసిగట్టి దూరంగా జరిగింది కాళి. పరాశరుడు వినలేదు. పడవ చుట్టూ పొగమంచు సృష్టించాడు. కాళి శరీరం నుంచి కస్తూరి పరిమళాలు గుప్పుమనేట్టు చేశాడు. నది మధ్యలో ఒక దీవిని సృష్టించాడు. ఇద్దరూ అక్కడికి వెళ్లి అమరసుఖాలు అనుభవించారు. కాళి గర్భం ధరించింది. పరాశరుడు ఆమెను ఓదారుస్తూ, "నీవు గర్భం ధరించినా నీ కన్యత్వానికేమీ దూషణ వుండదు. నీకు పుట్టబోయే పిల్లవాడు విష్ణు అంశతో జన్మిస్తాడు. సద్గుణశీలుడు, సర్వవిద్యాపారంగతుడు అయి ముల్లోకాల్లోను కీర్తింపబడతాడు. జగద్గురువవుతాడు. ఏక రాశిగా వున్న వేదాలను ఋక్ యజుస్సామ అధర్వణాలుగా విభాగం చేసి వాటికి సూత్రభాష్యాలు రచిస్తాడు. మహా తపస్వీ, మహా మహిమాన్వితుడూ అవుతాడు. ఇప్పుడు నీ ఒంటికి అబ్బిన కస్తూరి పరిమిళం శాశ్వతమైన నువ్వు "యోజనగంధి"వి అవుతావు" అని దీవించాడు.
మహర్షి అన్నట్టుగానే కాళింది పండంటి పిల్లవాణ్ణి కన్నది. అతను చిన్నతనం నుంచే దైవభక్తితో పెరిగాడు. పెద్దల ఎడ వినయ విధేయతలతో మెలిగాడు. పెద్దయ్యాక, "తల్లీ! నా గురించి విచారించకు. తపస్సు చేసుకునేందుకు నేను అడవులకు వెళ్తున్నాను. నీకు ఎప్పుడైనా దుఃఖం కలిగినా, కష్టం కలిగినా, లేదా చూడాలనిపించినా నన్ను తలచుకో. నేను నీ ముందుకు వచ్చి నిలుస్తాను" అని చెప్పి అడవులకు వెళ్ళిపోయాడు. అతనే కృష్ణద్వైపాయనుడయ్యాడు. అతని తల్లే చంద్రవంశానికి చెందిన శంతను మహారాజును పెళ్ళి చేసుకుంది. ఆ విధంగా కురుపాండవులకు చాలా దగ్గరవాడు వ్యాసుడు. ఇరువర్గాలకు ఆధ్యాత్మిక గురువు కూడా ఆయనే. పరిపాలనాసంబంధమైన విషయాలలో కురుపాండవులు కృష్ణద్వైపాయనుడి సలహాలు తీసుకునేవారు. అయితే ఆయన హస్తినాపురంలో కన్నా అడవులలో తపస్సు చేసుకుంటూ వున్న కాలమే చాలా ఎక్కువ.
కురుపాండవ సంగ్రామం ముగిసిన తరువాత ఆయన భారతగాథ ఆమూలాగ్రం ఊహించాడు. కాని దీనిని గ్రంథస్తం చేసి లోకంలో చదివించడం ఎలా, ఈ కథను వ్రాసేవారెవరు అన్న ప్రశ్న వచ్చింది. వెంటనే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి ధ్యానించాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు.‎
"మహర్షీ! నీకేం కావాలి?" అని బ్రహ్మ అడిగాడు.
వ్యాసమహర్షి పరమేష్ఠికి నమస్కరించి తన మనోవేదన వెల్లడించారు. అప్పుడు బ్రహ్మ "మహర్షీ! ఈ కథ వ్రాయడానికి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించు. నీవు సంకల్పించిన గ్రంథం వ్రాయగలవాడు గణపతి ఒక్కడే. నీ కోరిక సిద్ధిస్తుంది" అని చెప్పి అంతర్ధానమయ్యాడు.
అప్పుడు వ్యాసుడు సిద్ధి వినాయకుణ్ణి ప్రార్ధించాడు. వెంటనే ఆయన ప్రత్యక్షమయ్యాడు. వ్యాసమహర్షి గజాననుడికి నమస్కరించి "లంబోదరా! మహాభారత మహాగ్రంథాన్ని నేను మనస్సులో ఊహించుకున్నాను. అది నేను చెబుతూవుంటే మీరు వ్రాసుకుపోతూ వుండాలి. ఏమంటారు స్వామీ" అని అడిగాడు.
అందుకు వినాయకుడు ఒక షరతు పెట్టాడు. "నేను వ్రాస్తూ వున్నప్పుడు నా లేఖిని క్షణమైనా ఆగడానికి వీలులేదు. అలా నీవు ఆపకుండా చెప్పుకుపోగలవా?" అని అడిగాడు.
ఇది చాలా కఠినమైన నిబంధన. అయినా వ్యాసుడు ఒప్పుకున్నాడు. బదులుగా, "దేవా! నేను చెప్పేదాని భావం సంపూర్ణంగా తెలుసుకుని వ్రాసుకుపోతుండాలి. అందుకు తమరు సిద్ధమేనా" అని ఎదురు ప్రశ్నించాడు మహర్షి.
గణనాథుడు చిరునవ్వు నవ్వి "సరే" అన్నాడు.
ఆ విధంగా వ్యాసుడు చెబుతూవుంటే వినాయకుడు వ్రాయడం వలన మహాభారత కథ గ్రంథస్థమై అలరారింది. దానిని మొట్టమొదట తన కుమారుడైన శుకుడికి చెప్పాడు మహర్షి. ఆ తరువాత ఆయన శిష్యులు అనేకులు ఈ కథ చెప్పుకున్నారు.
ఈ కథను దేవలోకంలో దేవతలకు వినిపించినవాడు నారదుడు. గంధర్వులకు, యక్షులకు, రాక్షసులకు చెప్పినవాడు శుకయోగీంద్రుడు. ఇక ఈ మహాభారత పుణ్యకథను మానవలోకానికి చెప్పిన మహనీయుడు వ్యాసులవారి ముఖ్య శిష్యుడు వైశంపాయనుడు.
మహాసముద్రంతో పోల్చదగిన మహాభారతంలో లేని ధర్మసూక్ష మంటూ లేదు. ధర్మజ్ఞులు దీనిని ధర్మశాస్త్రమన్నారు. ఆధ్యాత్మిక తత్త్వవిదులు దీనిని వేదాంతసారమన్నారు. నీతికోవిదులు నీతిశాస్త్రమని, కవి పండితులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వ లక్షణ సంగ్రహమని, ఐతిహాసికులు మహాఇతిహాసమని, పౌరాణికులు సకల పురాణాశ్రయమని శ్లాఘించారు.
విద్యలకు వేలుపు అయిన వినాయకుడు వ్రాయడం వలన భారత కథ సావధానచిత్తులై వినినవారికి ధర్మార్థ సంసిద్ధి కలుగుతుందని ప్రసిద్ధి.




అందుకే  మరి తింటే గారెలు తినాలి ,వింటే భారతం వినాలి అంటారు.......

--సీత