Tuesday, 24 July 2012

స్వర్గమా ఇక్కడ దాగావా ...!!


రంగురంగుల ప్రపంచం
రాగాలు పలికించె
ఎదనిండా మల్లెలువిరబూసి 
నా ఆశలన్నీ పరిమళభరితమాయే ...

పరుగులు తీసింది  కదలని అంతరంగం
పసిపాపనిచేసింది  ప్రకృతి అందం
ఎగిరిగంతులు వేసిన  నా హృదయం
ప్రకృతి ఒడిచేరింది  ముద్దుమురిపాలకై ....

అడవినేర్పింది  అందమయిన అమాయకత్వం
చల్లదనం చేరింది  నా చింతలు తొలగించి 
ముద్దుగా చేరువయ్యింది మానసికప్రపంచం
నా ముచ్చట తీర్చి నన్నలరించింది ....

కలసిపోయా  పూర్తిగా పాలమనసుతో
ఏకమయిపోయా  స్వేచ్చగా నిశ్సబ్దామృతంలో 

ఎక్కడో లేదు అనిపించింది  'స్వర్గం'
ఇక్కడే  తల్లి  'భూమి  ఒడి' లోనే 
ఒడిలో ఒదిగిన పసిపాపనైన నా 'మనసు'లో ......!!

మొన్న ఒక పూలతోట దగ్గరికెళ్ళినప్పుడు ఎందుకో ఇలా అనిపించింది.
-- seetha..

Tuesday, 17 July 2012

'నీటి' లా 'మనసు'....

తరంగమై ఆలపించగలదు అనంత సంగీతాన్ని
తరంగిణియై అభినయించగలదు నాట్యాన్ని

ఎగరగలదు గాలిలో ఆవిరియై 
చల్లార్చగలదు అవనిని తుషారమై 

వెలిగించగలదు దీపాన్ని మిణుగురుదేహంలో 
ఆర్పగలదు మన దేహదీపాన్ని క్షణికంలో 

దూరగలదు రాళ్ళసందులో
దాటిపోగలదు శిఖరాలను
పెరగగలదు సముద్రమంత
కాగలదు సూదిమొనంత  

పంచభూతాలలో ద్రవం
మన పాలిటి కనకం

స్వల్పంగా అరచేతి లో ఇముడుతుందని చిన్నచూపేలా..?!?!
'ఆడదాని మనసు'లా ఎగసే 'నీటి' గొప్ప తనాన్ని మరిస్తే ఎలా..??!

--సీత ....


Sunday, 15 July 2012

అంధురాలినయిపోయాను..!!


 
ద్వేషపూరిత హృదయాలని
దేశభక్తి తో నింపాలని 
 తెలిపి తెలిపి మార్చలని తపిస్తూ,


ఆశాపాశాన్ని  తెగ నరకాలని 
ఆనందానికి అవధులు కట్టాలని 
 తలచి తలచి తల్లడిల్లుతూ,

హత్యలూ హింసలూ ఆపాలనీ 
వాంచలూ వేధింపులూ ఆగాలనీ
ఇలా కలలని కలిపి కలిపి అలసిపోతూ,


తల్లితండ్రులు బిడ్డల కందించే 
ఆప్యాయత వారు తిరిగివ్వాలనీ
ఆనందామృతంలో వారుండాలనీ ఆశిస్తూ, 

మగువల పై అరాచకాలని ఆపాలనీ
మగువలూ మంచిమనసుతో మారాలనీ
మన జీవితాలలో బంధాలు శాశ్వతమవ్వాలనీ,


స్వార్ధాన్ని వదలాలని
పరమార్ధం కై పరుగులు తీస్తూ 
అర్ధమే లేకుండా పోయిన ఈ,

జీవితమనే లోకం లో
జీవించాలనే తపన తో
వెలుతురికై వెతికి వెతికి...

అంత్యములో   నిశీధి నే చేజిక్కించుకొని 
 అంధకారం తో  అంధురాలినయిపోయాను..!!

--సీత...

Tuesday, 10 July 2012

నీకోసం......♥♥♥


'పవన'మై చల్లగా నీవు నలుగురికి సేద తీరుస్తానంటే 
నీ కోసం,పుష్పం గా మారి  పరిమళాన్నందిస్తూపోతా...!! 

'ఆకాశ'మై సూర్యచంద్రతారలని మోస్తూ నీవలసిపోతుంటే  
నీ కోసం,సేద తీర్చడానికి నిన్నుకప్పే మేఘాన్నయిపోతా..!!

'నేల'ని కాపాడుతూ చెట్టు గా నీడనిస్తూ నేనుండిపోతానంటే 
నీకోసం , నిను వీడక ఆ చెట్టు కి ఆకునై కదిలిపోతా..!! 

సముద్రమై 'నీటి'నందిస్తూ అందరికీ ఆధారంగా వ్యాపిస్తానంటే 
నీ కోసం, నిన్నలరిస్తూ ఆనందం తో అలనై ఎగసిపోతా ...!! 

'నిప్పు'నై దహించుకుపోతూ నలుగురికి వెచ్చదనమిస్తానంటే 
నీ కోసం,ననుకాల్చే వెచ్చదనమివ్వమని కట్టెలుగా మారిపోతా..!! 

'పంచభూతాల'లో ఏకమై నేను పరులకుపయోగపడతానంటే 
నీకోసం,నీ 'ఆరోప్రాణ'మై నీతోనే నీలో ఇలాగే ఏకమయిపోతా..!! 

--సీత

Saturday, 7 July 2012

అప్పుడప్పుడూ......


కలవరిస్తుంటే  కలలోనేనా కలిసేది ఎప్పుడూ?
అప్పుడప్పుడూ ఇలలో నిజమయి నవ్వించచ్చుగా...!

ప్రేరేపించే రాగాల లో నేనా దాగేది ఎప్పుడూ?
అప్పుడప్పుడూ అనురాగమై అల్లుకోవచ్చుగా...!

చుట్టుముట్టే ఆలోచనల లో నేనా అల్లేది ఎప్పుడూ ?
అప్పుడప్పుడూ చెంత  చేరి చేయూతనివ్వచ్చుగా...!

 పిలవాలనిపించే పేరులో నేనా పలికేది ఎప్పుడూ?
అప్పుడప్పుడూ 'ప్రియా' అంటూ పలకరింపువవ్వచ్చుగా ...!

భారమయిన  బంధీవై గుండె లోనేనా కొలువయ్యేది ఎప్పుడూ?
అప్పుడప్పుడూ సంకెళ్ళు తెంచుకొని  బంధాన్నల్లచ్చుగా ...!

తపనపడే ఆరాటం లో నేనా తొంగిచూసేది  ఎప్పుడూ?
అప్పుడప్పుడూ నిను  చూసుకునే భాగ్యం ప్రసాదించవచ్చుగా...!

కనులుమూస్తే రెప్పలుతాకే తడిలోనేనా ఆగేది ఎప్పుడూ?
అప్పుడప్పుడూ కన్నీళ్లు తుడిచి కంటిపాప లో కదిలిపోవచ్చుగా...!

మనసు పడే ఆరాటం లోనేనా మాయచేసేది ఎప్పుడూ?
ఎల్లప్పుడూ..... మనసుకోరే రూపం లా రావచ్చుగా ...!

--సీత


Monday, 2 July 2012

మగువ ..........



పసికందు గా బోసినవ్వులతో నీ ఒడి లో ఊయలలూగుతుంది
నీ గుండెల పై తన పాదాలు తో తంతూ ఆనందాన్నిస్తుంది 
బుడిబుడి పాదాలతో తప్పటడుగులేస్తూ నిన్ను మురిపిస్తుంది
తోబుట్టువయి నీ తోడు గా చిన్న-చిన్న  గొడవలతో సరదాన్నిస్తుంది
నేస్తమయి  ఆడీ-పాడీ నిన్ను నడిపించే ఒక ఆహ్లాదమవుతుంది 
ప్రియురాలయి నిత్యం నిన్ను ప్రోత్సహిస్తూ నిన్నల్లే ప్రేమవుతుంది 
భార్య గా నీ ఇంట్లో మమతానురాగాలనే  దివ్యదీపాన్ని వెలిగిస్తుంది 
అనునిత్యం నీ గురించే ఆలోచిస్తూ నీ సగమై సాగి  స్పూర్తినిస్తుంది 
నీ బంధువులతో ఒదిగి  అందరినీ కలుపుకుంటూ  నీవే తానవుతుంది 
నీ ప్రతిరూపాన్ని తను మోస్తూ భారం అంతామింగి తను మురిసిపోతుంది 
అమ్మై నీ పాప ని నీకు చూపి నీ కళ్ళల్లో వెలుగు చూసి అంతా మర్చిపోతుంది
ఆలనా-పాలన లో మునిగి అమ్మై తాను  మురిసిపోతూ నిన్ను మరిపిస్తుంది 
చదువుల తల్లై  బుజ్జాయి కి ఓ -నా-మా లు నేర్పుతూ నీ ప్రశంసవుతుంది 
నీ కలలకో రూపాన్నిస్తూ నీ జీవితాన్ని అందం గా దిద్దే ఒక నాయికవుతుంది 
బాధ్యతలన్నింటిలో నీ తోడూ-నీడయి ధైర్యాన్నికోల్పోనీక  నీ గెలుపవుతుంది 
ఇన్నేళ్ళు అలసిపోయారంటూ ఇక సేద తీరమంటూ నీకు ప్రశాంతతనిస్తుంది 
నీ కళ్ళల్లోకి చూస్తూ మరలా నీ ఒడి లో నే ఒదిగిపోయి కనుమూస్తానంటుంది ..."మగువ మనసు".....


అన్ని పాత్రలు ఎవరయినా పోషించగలరా ??
ఎవరెంత సాధించినా ఏదో ఒక రూపం లో దానికి పరోక్షంగా కారణం ఒక మహిళే...
అందుకే "మగువ -మకుటం లేని మహారాణి." 

కాదనగలరా? 


--సీత ....