Wednesday, 1 February 2012

భారతానికి శ్రీకారం ఇలా..


పరాశర మునీంద్రుడికి, సత్యవతికి జన్మించినవాడు వ్యాసుడు. సత్యవతి అసలుపేరు కాళి. మత్స్యగంధి అని కూడా అంటారు. బెస్త పిల్ల.
చేది దేశపు రాజు ఒక సారి వేటకని అడివికి వెళ్ళాడు. అక్కడ క్రీడిస్తున్న జంతువుల జంటను చూసి ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయాడు. కాళిందీ నదీతీరాన జరిగిందది. శాపవశాన చేపరూపాన ఆ నదిలో వున్న అద్రిక అనే దేవకన్య ఆ రేతస్సును స్వీకరించింది.
చేప గర్భం ధరించింది. కడుపులో వున్న చేప కదల్లేక మెదల్లేక బెస్తవాడి వలకు చిక్కింది. తీరా దాన్ని ఇంటికి తీసుకువెళ్ళి కోస్తే ఆ చేప కడుపులో ఇద్దరు పసికందులున్నారు. ఆ ఇద్దరిలో మగ పిల్లవాణ్ణి బెస్తరాజుగారికే ఇచ్చేశాడు. ఆడపిల్లను తానే అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఆ అమ్మాయికి "కాళి" అని పేరు పెట్టాడు.
కాళి పెరిగి పెద్దదైంది. పెళ్ళీడు పిల్లయింది.
పరాశర మహర్షి ఒక రోజు కళిందీ నది దగ్గరకు వచ్చి ఆవలి ఒడ్డుకు వెళ్ళేందుకు పడవ కోసం చూస్తున్నాడు. ఆ సమయంలో కాళి తండ్రి నది ఒడ్డున అప్పుడే చద్దిమూట విప్పుకుని భోజనానికి కూర్చోవడం వల్ల మహర్షిని ఆవలి ఒడ్డుకు తీసుకువెళ్ళమని కూతుర్ని పురమాయించాడు. మత్స్యగంధి సరేనంది. మహర్షి పడవలోకి ఎక్కాడు. పడవ నడుస్తోంది. ఎగిసిపడే అలలు, ఎగిరెగిరిపడే చేపపిల్లలు, పడవ నడిపే వయ్యారి - పరాశరుడికి చిత్తచాపల్యం కలిగించాయి.
కామోద్రేకంతో ఆమెను సమీపించాడు. మునిపుంగవుని కోరికను పసిగట్టి దూరంగా జరిగింది కాళి. పరాశరుడు వినలేదు. పడవ చుట్టూ పొగమంచు సృష్టించాడు. కాళి శరీరం నుంచి కస్తూరి పరిమళాలు గుప్పుమనేట్టు చేశాడు. నది మధ్యలో ఒక దీవిని సృష్టించాడు. ఇద్దరూ అక్కడికి వెళ్లి అమరసుఖాలు అనుభవించారు. కాళి గర్భం ధరించింది. పరాశరుడు ఆమెను ఓదారుస్తూ, "నీవు గర్భం ధరించినా నీ కన్యత్వానికేమీ దూషణ వుండదు. నీకు పుట్టబోయే పిల్లవాడు విష్ణు అంశతో జన్మిస్తాడు. సద్గుణశీలుడు, సర్వవిద్యాపారంగతుడు అయి ముల్లోకాల్లోను కీర్తింపబడతాడు. జగద్గురువవుతాడు. ఏక రాశిగా వున్న వేదాలను ఋక్ యజుస్సామ అధర్వణాలుగా విభాగం చేసి వాటికి సూత్రభాష్యాలు రచిస్తాడు. మహా తపస్వీ, మహా మహిమాన్వితుడూ అవుతాడు. ఇప్పుడు నీ ఒంటికి అబ్బిన కస్తూరి పరిమిళం శాశ్వతమైన నువ్వు "యోజనగంధి"వి అవుతావు" అని దీవించాడు.
మహర్షి అన్నట్టుగానే కాళింది పండంటి పిల్లవాణ్ణి కన్నది. అతను చిన్నతనం నుంచే దైవభక్తితో పెరిగాడు. పెద్దల ఎడ వినయ విధేయతలతో మెలిగాడు. పెద్దయ్యాక, "తల్లీ! నా గురించి విచారించకు. తపస్సు చేసుకునేందుకు నేను అడవులకు వెళ్తున్నాను. నీకు ఎప్పుడైనా దుఃఖం కలిగినా, కష్టం కలిగినా, లేదా చూడాలనిపించినా నన్ను తలచుకో. నేను నీ ముందుకు వచ్చి నిలుస్తాను" అని చెప్పి అడవులకు వెళ్ళిపోయాడు. అతనే కృష్ణద్వైపాయనుడయ్యాడు. అతని తల్లే చంద్రవంశానికి చెందిన శంతను మహారాజును పెళ్ళి చేసుకుంది. ఆ విధంగా కురుపాండవులకు చాలా దగ్గరవాడు వ్యాసుడు. ఇరువర్గాలకు ఆధ్యాత్మిక గురువు కూడా ఆయనే. పరిపాలనాసంబంధమైన విషయాలలో కురుపాండవులు కృష్ణద్వైపాయనుడి సలహాలు తీసుకునేవారు. అయితే ఆయన హస్తినాపురంలో కన్నా అడవులలో తపస్సు చేసుకుంటూ వున్న కాలమే చాలా ఎక్కువ.
కురుపాండవ సంగ్రామం ముగిసిన తరువాత ఆయన భారతగాథ ఆమూలాగ్రం ఊహించాడు. కాని దీనిని గ్రంథస్తం చేసి లోకంలో చదివించడం ఎలా, ఈ కథను వ్రాసేవారెవరు అన్న ప్రశ్న వచ్చింది. వెంటనే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి ధ్యానించాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు.‎
"మహర్షీ! నీకేం కావాలి?" అని బ్రహ్మ అడిగాడు.
వ్యాసమహర్షి పరమేష్ఠికి నమస్కరించి తన మనోవేదన వెల్లడించారు. అప్పుడు బ్రహ్మ "మహర్షీ! ఈ కథ వ్రాయడానికి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించు. నీవు సంకల్పించిన గ్రంథం వ్రాయగలవాడు గణపతి ఒక్కడే. నీ కోరిక సిద్ధిస్తుంది" అని చెప్పి అంతర్ధానమయ్యాడు.
అప్పుడు వ్యాసుడు సిద్ధి వినాయకుణ్ణి ప్రార్ధించాడు. వెంటనే ఆయన ప్రత్యక్షమయ్యాడు. వ్యాసమహర్షి గజాననుడికి నమస్కరించి "లంబోదరా! మహాభారత మహాగ్రంథాన్ని నేను మనస్సులో ఊహించుకున్నాను. అది నేను చెబుతూవుంటే మీరు వ్రాసుకుపోతూ వుండాలి. ఏమంటారు స్వామీ" అని అడిగాడు.
అందుకు వినాయకుడు ఒక షరతు పెట్టాడు. "నేను వ్రాస్తూ వున్నప్పుడు నా లేఖిని క్షణమైనా ఆగడానికి వీలులేదు. అలా నీవు ఆపకుండా చెప్పుకుపోగలవా?" అని అడిగాడు.
ఇది చాలా కఠినమైన నిబంధన. అయినా వ్యాసుడు ఒప్పుకున్నాడు. బదులుగా, "దేవా! నేను చెప్పేదాని భావం సంపూర్ణంగా తెలుసుకుని వ్రాసుకుపోతుండాలి. అందుకు తమరు సిద్ధమేనా" అని ఎదురు ప్రశ్నించాడు మహర్షి.
గణనాథుడు చిరునవ్వు నవ్వి "సరే" అన్నాడు.
ఆ విధంగా వ్యాసుడు చెబుతూవుంటే వినాయకుడు వ్రాయడం వలన మహాభారత కథ గ్రంథస్థమై అలరారింది. దానిని మొట్టమొదట తన కుమారుడైన శుకుడికి చెప్పాడు మహర్షి. ఆ తరువాత ఆయన శిష్యులు అనేకులు ఈ కథ చెప్పుకున్నారు.
ఈ కథను దేవలోకంలో దేవతలకు వినిపించినవాడు నారదుడు. గంధర్వులకు, యక్షులకు, రాక్షసులకు చెప్పినవాడు శుకయోగీంద్రుడు. ఇక ఈ మహాభారత పుణ్యకథను మానవలోకానికి చెప్పిన మహనీయుడు వ్యాసులవారి ముఖ్య శిష్యుడు వైశంపాయనుడు.
మహాసముద్రంతో పోల్చదగిన మహాభారతంలో లేని ధర్మసూక్ష మంటూ లేదు. ధర్మజ్ఞులు దీనిని ధర్మశాస్త్రమన్నారు. ఆధ్యాత్మిక తత్త్వవిదులు దీనిని వేదాంతసారమన్నారు. నీతికోవిదులు నీతిశాస్త్రమని, కవి పండితులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వ లక్షణ సంగ్రహమని, ఐతిహాసికులు మహాఇతిహాసమని, పౌరాణికులు సకల పురాణాశ్రయమని శ్లాఘించారు.
విద్యలకు వేలుపు అయిన వినాయకుడు వ్రాయడం వలన భారత కథ సావధానచిత్తులై వినినవారికి ధర్మార్థ సంసిద్ధి కలుగుతుందని ప్రసిద్ధి.
అందుకే  మరి తింటే గారెలు తినాలి ,వింటే భారతం వినాలి అంటారు.......

--సీత 

No comments:

Post a Comment