Saturday, 11 August 2012

నాతో సాగుమా...!!

క్షణం లో పరిచయాన్ని పెంచిన వరమా
మాటకోసం పరితపించిన అనుకోని స్నేహమా
ఎదలోతులో ఆరాటం రేపిన తియ్యని అనుభవమా
ఆనందాలను అధికం చేసి బాధలేలేవన్న అనురాగమా
కన్నీటిధారలా కొన్ని సార్లు ఆగని ప్రయాణమా 
అలుపెరగని ఊసులెన్నో పెనవేస్తోన్న ప్రణయమా 
ఎదురుచూపులలో అలసిన కనులకు కలవరమా 
నీకోసమే నేనని చెప్పినప్పుడు దొర్లిన ముత్యమా ఓ నా ప్రేమా ,
జీవితాన్ని వెలిగించి జీవితాంతం నాతో సాగుమా...!!

--సీత 


Friday, 10 August 2012

లాలి గోపాల కృష్ణా .....లాలి....!!

బంగారుపానుపుపై నీవు పవళించు
ప్రేమభక్తిపూల శయ్య పరచినాను
ఆడిపాడిచిందులు తొక్కి అలసిపోయావు
చల్లగాను జోలపాడి పాదములొత్తెద దరిచేరరా...!!

పాలుమీగడబువ్వను గోరుముద్దతో ఆరగించరా 
ప్రేమను పెరుగులా చేసి అందిస్తున్నానురా  
ముఖారవిందముపై చెమట కప్పియున్నదిరా
చూడలేదు నా హృదయం కనులుమూసుకోరా.....!!

లాలి గోపాల కృష్ణా .....లాలి....!!

--సీత 

ఊయలలూగు కృష్ణ .........


ఊయలలూగు కృష్ణ ఊయలలూగు
కమ్మగా వింటూ   ఊయలలూగు


వ్రేపల్లె నీకు ఊయాల కట్టి
గోపెమ్మ ఎద  మెల్లగా ఊపే
నందునీంట వెలసీ జగమందు
కనువిందై వెలిగే నీ లీల ...!!

కన్నతల్లై దేవకి పొందిన దే భాగ్యమూ?
మనసార హత్తుకున్న యశోద కెంత పుణ్యమూ?
ఆటలాడి అన్నిచేసే నీ స్నేహితుల కెంత స్థైర్యమూ?
అలరారి మురిసిపోయే గోపికల దెంత ఆనందమూ..??


నీలో లీనమయి నీ ప్రేమ పొందిన రాధదే అదృష్టము?
నీతో సహచర్యము చేసి నీ అనురాగంపొందిన భార్యలదే సౌఖ్యము ?
నిన్నే కీర్తించి నీలోనే ఏకమయిన నీ భక్తుల దే స్థానము ?
నీ చేత సమ్హరించబడ్డ రాక్షసుల దేంతటి వైభోగము ?ఈనాటి ఈ సేవ నీవందుకొని 
ఆనాటి అనుభూతులన్నీ నా ఎద నిండనీ 

ఊయలలో నీవు కనులవిందై ఊగుతూ 
ఊయలూపుతూ నన్నిలా ఉండిపోనీ కృష్ణా....!!

--సీత అందుకో కృష్ణా...!!వినసొంపైన వేణుగానామృతునికి
'విరజాజులు' చెస్తున్న  వినమ్రార్చన  

రాధాప్రేమ పాశబంధనుడికి
'రోజాలు' చేస్తున్న రమణీయార్చన


సౌమ్యస్వరూపునికి సుకుమారస్వామికి
''సంపంగెలు' చేస్తున్న  .సుస్వరార్చన.....  


మనసులో నిలచిపోయే మోహనరూపునికి
'మల్లెలు' చేస్తున్న మనోహరార్చన 

ప్రేమనే ధరించిన ప్రేమమూర్తికి
 'పారిజాతాలు' చేస్తోన్న పదార్చన 

కరుణచూపులు జార్చే కమనీయకనులకు 
'కలువలు' చేస్తున్న కళ్యాణార్చన 

చిందులు తొక్కి అలసిపోయిన చిన్నిపాదాలకు
'చేమంతులు'  చేస్తున్న  చెలిమార్చన

ధరణిని ధరియించిన దయాలోలునికి   
'దాసానులు' చేస్తున్న దివ్యఘనార్చన 

కనకన రుచించే కనకధారరూపునికి
'కనకాంబరాలు' చేస్తోన్న కావ్యార్చన


బుడిబుడి అడుగులతో చేరే బాలకృష్ణుడికి  
'బంతిపూలు' చేస్తోన్న భవ్యభోగార్చన

కలవరిస్తే కదిలి వచ్చే నా కృష్ణుడికి
'సీత మనసు' చేస్తోన్న తన్మయార్చన ఇది ...!!

అందుకో కృష్ణా...!

--సీతమేలుకో కృష్ణా ...


మసకతెరల మాటు రాగాలు మేల్కొలిపె నిన్ను
మంచుకరిగే వేళలో మనోహరమయిన పుష్పాలు 
పరిమళాన్నందిస్తూ లేవయ్యా అంటూ విచ్చుకునె 

భారాన్నంతా మోస్తూ అలసిపోయిన భూమాత కొరె
కరుణించి నన్ను నీ మెత్తని పాదాలతో స్పృసించి 
అన్యాయాన్ని ఖండించడానికి అడుగువేయమని అడిగె 

మనసులో నిన్నే దాచుకున్న ఎందరో భక్తులు నీకోసం
ఎదురుచుసె వేయికన్నులలో వేయికిపై వత్తులువేసుకొని
నీ నడకకోసం ,నీ బాట ననుసరించడానికై కుతూహతతో 


నీ అడుగుల సవ్వడికి అన్యాయం అంతమయిపోవాలి
నీ వేణు గానంతో మా మదిలో వెలయాలి ప్రేమరాగాలు
నీ చిరునవ్వులో వెతుక్కోగలగాలి స్వచ్చమయిన ఆనందాన్ని
నీ తత్వం జగమంతా వెలిగి మాలోని జ్యోతులను వెలిగించాలి  ...!!

లే కృష్ణా .......
 నీ కోసం పరితప్పిస్తున్న మా అందరికీ అందించు నీ ప్రేమానందాన్ని...!!

--సీత...Monday, 6 August 2012

ఎగసిన కెరటం.......

మనసులోతు లో ఎగసిన కెరటం
అక్షరాలను దిద్దుతోంది అందంగా
నీవు మదికి చేసిన గాయాన్ని 
సున్నితంగా తుడిచేయాలని అప్రయత్నంగా.....!!

ఆ కెరటానికి  తెలుసా పాపం... ??
ఆ అక్షరాల కి రూపమై 
ప్రాణం పోసింది  నీవేనని.....!

కన్నీటిని కన్పించనిస్తే ఎక్కడ జారిపోతావేమో 
అన్న భయం తో  శాస్వతం గా అక్షరాలని చేసానని .......!

అలలై  ఎగసిపడుతున్న కన్నీటిని 
బయటకి రానీక ఇలా అక్షరాలను చేస్తున్నానని .......!

తెలుసుకొని నిన్ను  తప్ప వేరేది ఉంచగలదా?
కనీసం ఊహించగలదా ?

నేనే ఊహించలేను....
 ఇక అదెలా చేస్తుంది 
అందుకే,
నీ విలువ తెలియచెప్పిన నన్ను కుడా 
కాదని నిన్నే అనుభవిస్తోంది ప్రియా....!!

ప్రతి అక్షరాన్ని వాక్యాలుగా కూర్చుకుంటూ  
వాక్యాలన్నీ  కథలుగా మార్చుకుంటూ 
కథలన్నీమన  అనుభూతులై అల్లుకుంటూ 
నీ జ్ఞాపకాల కావ్యం తో మదిని నింపేస్తోందా కెరటం......!!

--సీత 
Sunday, 5 August 2012

నీ స్నేహం ..!!

Inline image 2


మరపుకు రాని నేస్తాలెందరున్నా
మరువలేనిది  నీ స్నేహం....!!

మనోహరమయిన ఆనందాలెన్నిటిలోఉన్నా
మది వెతికే ఒకే ఒక ఆనందం నీ స్నేహం..!!

ఆత్మీయత పంచే ఎందరితో కలిసి సాగుతున్నా
అనంతమయిన అపురూపం నీ స్నేహం ..!!

నిరంతరం వెతుకులాటలో అలసిపొతున్నా 
అలసటనేకాక నన్నే మరిపించే మంత్రం నీ స్నేహం..!! 

కష్టాల కడలితో ఆగక కదిలిపోతున్నా
తోడు నేనున్నా అని కదిలిన కావ్యం నీ స్నేహం..!!  

నేస్తం ,
విడువలేను నీ స్నేహహస్తం .....!!

ఇటువంటి నేస్తాలు మన జీవితాలలో అరుదు గా ఉంటారు.
అటువంటి వారిని మనం విడువకూడదు ....!!!
అలాంటి నా నేస్తాల కోసం.....
బ్లాగర్స్ అందరికీ  HAPPY FRIENDSHIP DAY....

--సీత 

Friday, 3 August 2012

పగలే జాబిలి చేసె. .......


నీటికి అలమటించిన మా ఊరు
పవనాన్ని బతిమాలె పదే పదే
రాయబారంపంపే మేఘాలకు
మన్నించి కరుణించి కురవమని

ఎండ వేడి కి తడి ఆరిన ఆకులు
నీటి ఆవిరుల లేఖలు పంపె
ముచ్చటపడిన మార్తాండుడు 
శాంతిపొంది మబ్బులని పిలిచె

కందిపొయిన పూలరేకులు
కోపగించి ముడుచుకు పోయె 
చూసి కలతచెందిన వరుణుడు
మంచుకరగతీసి చల్లదనం కూర్చె 

కనులు తెరవని మూగజీవులు
మూలుగుతూ రాగాలాలపించె
కరుణ హృ దయుడు కదలిపోయె 
జాలి చూపి పగలే జాబిలి చేసె......!!!!


enjoyed rain...

-- సీత.....

Sunday, 29 July 2012

ఆగిపోదామా ఇలా....??!!


 సాగిపోదామా....?
 గలగలమనే సెలయేరు పై,
 చల్లగా జాలువారే నీటి ప్రవాహాన్ని ఆపద్దని...!!

ఎగిరిపోదామా ....?
దూసుకుపోయే గాలిపటం లా,
కమ్మగా గాలికి మన ప్రేమ పరిమళాన్నద్దుకోమని..!!


అల్లుకుపోదామా ? 
  ఎదిగిపోయే తీగల పై,
ఆకునీవై,పూవు నేనై ఇద్దరినీ ఒదిగుండనివ్వమని..!!

కలిసిపోదామా...?? 
వాగర్ధాలకే అందని అర్ధం లా,
నిన్నూనన్నూ ఏవీ వేరు చేయలేవనే వాక్యాన్ని చెప్పమని...!!

పారిపోదామా...?
 ప్రకృతిపై పయనించే ప్రవాహంలా,
అందనంత ఎత్తులో ఉన్న ఆకాశాన్నే మనల్ని చేరతీయమని ..!!

కానీ ,
నే గీసిన చిత్రం..
ఆగిపోదాం....... ఇలా చంద్రుడిలో 
 ఒకరిలోఒకరం ఒదిగిపోతూ 
మనల్నేవి కదిలించకుండా వృత్తంలో  ఇలా దాచేసుకొమ్మని ..!! 


-
-సీత..

Thursday, 26 July 2012

కృష్ణా...!! ఎచట నీ స్థానం??

ముందు గా ఈ పోస్ట్ చదవడానికి వచ్చిన వారందరికీ ఒక చిన్న మనవి ..
నేను నా ఊహలని ఇలా కృష్ణుడి పలికినట్టుగా ,నా అనుభవాలు,నా ఊహలు, నా కవితలతో పాటు చెబ్దాం అని ప్రయత్నం. ఇలా రాయచ్చో లేదో నాకు తెలీదు ...కాని రాసేసా...!!


ఆ'రాధ'నై కృష్ణుణ్ణి అడుగుతున్నా....!!  


  
సీత :కృష్ణ , నాదొక పెద్ద సందేహం తీర్చవూ??

కృష్ణ :: తప్పకుండా అడుగు మరి ...!!

 సీత::  నీ స్థానం ఎచట కృష్ణ...??

కృష్ణ ::అంటే ..??

 సీత ::

"గోపాలుడి గా గోవుల వద్దనా?
  బాలుడి వై యశోద ఒడి లోనా?

  ప్రేమించే రాధ హృదయం లోనా?
  పరిపాలించే అష్ట భార్యల ఆనందం లోనా?

   గోపికలతో బృందావనం లో నా?
   స్నేహాన్ని కోరే మిత్రుల సన్నిహిత్యం లోనా?

   నెమలి నాట్యాన్నానందించడం  లో నా?
   వేణువు వదిలే  మధురమయిన శ్వాస లోనా?

  ప్రేమగా నిన్నల్లె మల్లెల మాలల లోనా?
  కాళింది తలపై నటియించిన బాలతెజస్సులోనా?

     భక్తి గా భజించే హృదయాల లో నా?
     నిన్ను కీర్తనలతో కట్టేసే  మనసులలోనా?

ఇన్ని స్థలాలా నీకు కృష్ణా......
ఎచట ఉంటానంటావ్ శాశ్వతం గా.....??..."

కృష్ణ :: అయ్యో ......మరలా నన్నే అడుగుతున్నావా?
    
 సీత ::     అదేమిటి కృష్ణా?

కృష్ణ:: సరే నువ్వే అడిగావు  కదా అన్ని చోట్ల అని...మరి నీకు నేను ప్రశ్న గానే సమాధానం ఇస్తాను ..!!
         ఎచట లేనంటావ్???
 సీత :: కృష్ణ...అర్ధమయింది నీ తత్త్వం 
          "నిన్ను తలచే ప్రతి చోటా నువ్వుంటావ్ శాశ్వతంగా ......!!"
కృష్ణ:: అంతే గా మరి...!!


కృష్ణా అని ఆర్తి గా పిలిస్తే పలికే నా దైవం.కృష్ణా అని మనసారా తలిస్తే చాలు అన్నీ సమస్యలూ టక్కున మాయమయిపోతాయి...
మహిమలు అనిర్వచనీయం , మాయలు అద్వితీయం...
        తనని స్మరించే  అన్నింటిలో తానుంటాడు.......!!    ఇంకా ప్రేమ,సమస్యలు,  జీవితం ఇంకా వీటి గురించి కృష్ణుడు ఏం చెప్తారో తరువాత వాటిల్లో ....!!
కృష్ణాష్టమి కోసం అని ఇవి ఎప్పటినుండో తాయారు  చేసిఉంచుకున్నాను.
ఇప్పుడు ఇలా మీతో ఒక్కోటి పంచుకుంటున్నాను :)

Tuesday, 24 July 2012

స్వర్గమా ఇక్కడ దాగావా ...!!


రంగురంగుల ప్రపంచం
రాగాలు పలికించె
ఎదనిండా మల్లెలువిరబూసి 
నా ఆశలన్నీ పరిమళభరితమాయే ...

పరుగులు తీసింది  కదలని అంతరంగం
పసిపాపనిచేసింది  ప్రకృతి అందం
ఎగిరిగంతులు వేసిన  నా హృదయం
ప్రకృతి ఒడిచేరింది  ముద్దుమురిపాలకై ....

అడవినేర్పింది  అందమయిన అమాయకత్వం
చల్లదనం చేరింది  నా చింతలు తొలగించి 
ముద్దుగా చేరువయ్యింది మానసికప్రపంచం
నా ముచ్చట తీర్చి నన్నలరించింది ....

కలసిపోయా  పూర్తిగా పాలమనసుతో
ఏకమయిపోయా  స్వేచ్చగా నిశ్సబ్దామృతంలో 

ఎక్కడో లేదు అనిపించింది  'స్వర్గం'
ఇక్కడే  తల్లి  'భూమి  ఒడి' లోనే 
ఒడిలో ఒదిగిన పసిపాపనైన నా 'మనసు'లో ......!!

మొన్న ఒక పూలతోట దగ్గరికెళ్ళినప్పుడు ఎందుకో ఇలా అనిపించింది.
-- seetha..

Tuesday, 17 July 2012

'నీటి' లా 'మనసు'....

తరంగమై ఆలపించగలదు అనంత సంగీతాన్ని
తరంగిణియై అభినయించగలదు నాట్యాన్ని

ఎగరగలదు గాలిలో ఆవిరియై 
చల్లార్చగలదు అవనిని తుషారమై 

వెలిగించగలదు దీపాన్ని మిణుగురుదేహంలో 
ఆర్పగలదు మన దేహదీపాన్ని క్షణికంలో 

దూరగలదు రాళ్ళసందులో
దాటిపోగలదు శిఖరాలను
పెరగగలదు సముద్రమంత
కాగలదు సూదిమొనంత  

పంచభూతాలలో ద్రవం
మన పాలిటి కనకం

స్వల్పంగా అరచేతి లో ఇముడుతుందని చిన్నచూపేలా..?!?!
'ఆడదాని మనసు'లా ఎగసే 'నీటి' గొప్ప తనాన్ని మరిస్తే ఎలా..??!

--సీత ....


Sunday, 15 July 2012

అంధురాలినయిపోయాను..!!


 
ద్వేషపూరిత హృదయాలని
దేశభక్తి తో నింపాలని 
 తెలిపి తెలిపి మార్చలని తపిస్తూ,


ఆశాపాశాన్ని  తెగ నరకాలని 
ఆనందానికి అవధులు కట్టాలని 
 తలచి తలచి తల్లడిల్లుతూ,

హత్యలూ హింసలూ ఆపాలనీ 
వాంచలూ వేధింపులూ ఆగాలనీ
ఇలా కలలని కలిపి కలిపి అలసిపోతూ,


తల్లితండ్రులు బిడ్డల కందించే 
ఆప్యాయత వారు తిరిగివ్వాలనీ
ఆనందామృతంలో వారుండాలనీ ఆశిస్తూ, 

మగువల పై అరాచకాలని ఆపాలనీ
మగువలూ మంచిమనసుతో మారాలనీ
మన జీవితాలలో బంధాలు శాశ్వతమవ్వాలనీ,


స్వార్ధాన్ని వదలాలని
పరమార్ధం కై పరుగులు తీస్తూ 
అర్ధమే లేకుండా పోయిన ఈ,

జీవితమనే లోకం లో
జీవించాలనే తపన తో
వెలుతురికై వెతికి వెతికి...

అంత్యములో   నిశీధి నే చేజిక్కించుకొని 
 అంధకారం తో  అంధురాలినయిపోయాను..!!

--సీత...

Tuesday, 10 July 2012

నీకోసం......♥♥♥


'పవన'మై చల్లగా నీవు నలుగురికి సేద తీరుస్తానంటే 
నీ కోసం,పుష్పం గా మారి  పరిమళాన్నందిస్తూపోతా...!! 

'ఆకాశ'మై సూర్యచంద్రతారలని మోస్తూ నీవలసిపోతుంటే  
నీ కోసం,సేద తీర్చడానికి నిన్నుకప్పే మేఘాన్నయిపోతా..!!

'నేల'ని కాపాడుతూ చెట్టు గా నీడనిస్తూ నేనుండిపోతానంటే 
నీకోసం , నిను వీడక ఆ చెట్టు కి ఆకునై కదిలిపోతా..!! 

సముద్రమై 'నీటి'నందిస్తూ అందరికీ ఆధారంగా వ్యాపిస్తానంటే 
నీ కోసం, నిన్నలరిస్తూ ఆనందం తో అలనై ఎగసిపోతా ...!! 

'నిప్పు'నై దహించుకుపోతూ నలుగురికి వెచ్చదనమిస్తానంటే 
నీ కోసం,ననుకాల్చే వెచ్చదనమివ్వమని కట్టెలుగా మారిపోతా..!! 

'పంచభూతాల'లో ఏకమై నేను పరులకుపయోగపడతానంటే 
నీకోసం,నీ 'ఆరోప్రాణ'మై నీతోనే నీలో ఇలాగే ఏకమయిపోతా..!! 

--సీత

Saturday, 7 July 2012

అప్పుడప్పుడూ......


కలవరిస్తుంటే  కలలోనేనా కలిసేది ఎప్పుడూ?
అప్పుడప్పుడూ ఇలలో నిజమయి నవ్వించచ్చుగా...!

ప్రేరేపించే రాగాల లో నేనా దాగేది ఎప్పుడూ?
అప్పుడప్పుడూ అనురాగమై అల్లుకోవచ్చుగా...!

చుట్టుముట్టే ఆలోచనల లో నేనా అల్లేది ఎప్పుడూ ?
అప్పుడప్పుడూ చెంత  చేరి చేయూతనివ్వచ్చుగా...!

 పిలవాలనిపించే పేరులో నేనా పలికేది ఎప్పుడూ?
అప్పుడప్పుడూ 'ప్రియా' అంటూ పలకరింపువవ్వచ్చుగా ...!

భారమయిన  బంధీవై గుండె లోనేనా కొలువయ్యేది ఎప్పుడూ?
అప్పుడప్పుడూ సంకెళ్ళు తెంచుకొని  బంధాన్నల్లచ్చుగా ...!

తపనపడే ఆరాటం లో నేనా తొంగిచూసేది  ఎప్పుడూ?
అప్పుడప్పుడూ నిను  చూసుకునే భాగ్యం ప్రసాదించవచ్చుగా...!

కనులుమూస్తే రెప్పలుతాకే తడిలోనేనా ఆగేది ఎప్పుడూ?
అప్పుడప్పుడూ కన్నీళ్లు తుడిచి కంటిపాప లో కదిలిపోవచ్చుగా...!

మనసు పడే ఆరాటం లోనేనా మాయచేసేది ఎప్పుడూ?
ఎల్లప్పుడూ..... మనసుకోరే రూపం లా రావచ్చుగా ...!

--సీత